దళితులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి: మనోహర్
అమరావతి: రాష్ట్రంలో దళితులపై రోజు రోజుకీ దాష్టికాలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సీతానగరం పోలీస్ స్టేషన్‌లో దళిత యువకుడికి ఆటవికంగా శిరోముండనం చేయించిన ఘటన దారుణం అన్నారు. ఆ ఘటన అలా ఉంటే.. చీరాలలో పోలీసులు ఓ దళిత యువకుడిని పొట్టనపెట్టుకున్న తీరు బాధ కలిగించిందన్నారు. చీరాల పోలీసుల చర్యను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నామని ప్రకటించారు. కిరణ్ కుమార్ మరణానికి కారణమైన పోలీస్ అధికారిని వీఆర్‌కి పంపి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మనోహర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని అన్నారు. దళిత ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఇటీవలే కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుందని ఆయన పేర్కొన్నారు. దళిత యువకుడిపై అధికార పార్టీ నేత ప్రోద్బలంతోనే శిరోముండనం చేయించారని అన్నారు. సదరు నేతను ఇప్పటి వరకూ అరెస్ట్ చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంక్ గా చూస్తోందన్నారు. వారిపై ఇన్ని దాష్టీకాలు చోటు చేసుకున్నా అడ్డుకట్ట వేసేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని నిదర్శనం అని పేర్కొన్నారు.