ఆయనోఎంపీ.. ఆయ‌న‌కు ఎవ్వ‌రికీ చెప్పుకోలేని క‌ష్టం..!

0
Spread the love

బల్లి దుర్గా ప్రసాద్‌. తిరుపతి ఎంపీ.. గతంలో నెల్లూరు జిల్లా గూడురు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. చిన్న వయస్సులోనే అసెంబ్లీలోకి అడుగుపెట్టి శాసనసభ్యుడిగా నాలుగుసార్లు గెలిచారు. సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్న ఆయన తర్వాత వైసీపీలో చేరి.. ఇప్పుడు తిరుపతి ఎంపీగా ఉన్నారు.  వైసీపీ కేడర్‌ కానీ.. అధికారులు కానీ ఓ ఎంపీగా తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని దుర్గాప్రసాద్‌ ఆవేదన చెందుతున్నారట. ఇదే సమయంలో మా ఎంపీ ఎక్కడ అని నియోజకవర్గ ప్రజలు ప్రశ్నలు సంధించడం కలకలం రేపుతోంది.

లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు సైతం బల్లి దుర్గా ప్రసాద్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదన్న ప్రచారం ఉంది. అందుకే కొన్ని కార్యక్రమాల్లో ఆయన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని ప్రస్తావిస్తుంటారు పార్టీ నేతలు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం సగం చిత్తూరు జిల్లాలో, మరో సగం నెల్లూరు జిల్లాలో ఉంటుంది. చిత్తూరులో మూడు అసెంబ్లీ, నెల్లూరులో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు దీని కిందకు వస్తాయి. మొన్నటి ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో దుర్గాప్రసాద్‌కు తిరుపతి ఎంపీ టికెట్‌ లభించింది. ఆయనకు చిత్తూరు జిల్లా పూర్తిగా కొత్త. ఇక్కడి వైసీపీ నేతలతో పెద్దగా పరిచయాలు లేవు. నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నివాసం ఉంటున్న ఆయనకు అక్కడి ఎమ్మెల్యే వరప్రసాద్‌తో పొసగడం లేదు. వర ప్రసాద్‌ ఎవరో కాదు.. 2014లో తిరుపతి  వైసీపీ ఎంపీ ఆయనే. 2019 ఎన్నికల్లో వీరిద్దరి సీట్లు మారాయి. ఇదిలా ఉండగా.. ఎంపీ పరిధిలోని వెంకటగిరి, సర్వేపల్లి ఎమ్మెల్యేలు సైతం దుర్గాప్రసాద్‌ను కలుపుకొని వెళ్లడం లేదని అంటున్నారు.

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో కేవలం రాజకీయ స్నేహమే ఉందట. సర్వేపల్లి ఎమ్మెల్యేతో అది కూడా లేదు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యతో బంధుత్వం ఉండటంతో అక్కడ పరిస్థితి పర్వాలేదు.  ఇలా నెల్లూరు జిల్లా పరిధిలో ఎంతో కొంత నెట్టుకొస్తున్నా.. చిత్తూరు జిల్లాలోనే ఎంపీ దుస్థితి దారుణంగా ఉందని టాక్‌. పేరుకు తిరుపతి ఎంపీ అయినా గూడురులోనే ఎక్కువగా ఉండటం వల్ల స్థానిక నేతలు, ప్రజలతో గ్యాప్‌ వచ్చిందని అంటున్నారు. కరోనా సమయంలో ఆ దూరం ఇంకా పెరిగిపోయిందట. ఎంపీగా తిరుపతిలో ఉండేందుకు ఏడాదిగా అద్దె ఇంటి కోసం చూస్తున్నారట. ఆ ఇల్లు దొరక్కపోవడంతో తిరుపతికి చుట్టపు చూపుగానే వస్తున్నారట. అలా వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు, అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదన్నది ఎంపీ వర్గం ఆరోపణ. ఈ కారణంగానే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదని అంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌తో ఆయనకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయట. సత్యవేడు ఎమ్మెల్యేతో పెద్దగా పరిచయం లేదని చెబుతారు. అప్పుడప్పుడూ సమీక్షల్లో కలుసుకోవడం తప్ప జిల్లా మంత్రులతోనూ అంతగా సఖ్యత లేదని  ప్రచారం జరుగుతోంది. మరి.. ఎంపీ దుర్గా ప్రసాద్‌ ఈ పరిస్థితిని అధిగమిస్తారో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!