విగ్రహాల ఏర్పాటు ఉద్దేశం ఇదే: ఉప రాష్ట్రపతి

0
Spread the love

 న్యూఢిల్లీ: భారత దేశాభివృద్ధికి అవినీతి ఓ అవరోధంగా మారిందని.. దీన్ని దేశం నుంచి పారద్రోలేందుకు ప్రభుత్వంతోపాటు పౌరసమాజం, ప్రజలు సంయుక్తంగా పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. ‘రాజనీతిజ్ఞతతోపాటు సంఘ సంస్కర్తగా, తత్వవేత్తగా, మేధావిగా, న్యాయకోవిదుడిగా, ఆర్థికవేత్తగా, రచయితగా, మానవతా మూర్తిగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. ప్రపంచంలోనే దృఢమైన రాజ్యాంగం కలిగి ఉండటం భారతదేశ ప్రత్యేకత. దీని రూపకల్పనతోపాటు క్లిష్టమైన సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ పోషించిన పాత్ర అత్యంత కీలకం‘ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

భారత రాజ్యాంగం నేటికీ దేశానికి ఓ మార్గదర్శిగా దారిచూపిస్తోందన్న విషయాన్ని ఉప రాష్ట్రపతి గుర్తుచేశారు. అలాంటి రాజ్యాంగ పవిత్రతను కాపాడటంలో ప్రతి భారతీయుడు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న డాక్టర్ అంబేడ్కర్.. తన జీవితంలో చివరి క్షణం వరకు సామాజిక అసమానత, కుల, లింగ వివక్షతకు వ్యతిరేకంగా మహిళా సాధికారతకోసం కృషిచేశారన్నారు.

‘ఇలాంటి మహనీయుల జీవితాన్ని, వారు చూపిన ఆదర్శాలను గుర్తుచేసుకుని.. వాటినుంచి మనతోపాటు భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందడమే.. వీరి విగ్రహాలను ఏర్పాటుచేయడం వెనక ఉద్దేశం’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. డాక్టర్ అంబేడ్కర్ దూరదృష్టి కారణంగానే.. కాగ్ వంటి సంస్థల ఏర్పాటుతోపాటు వీటికి స్వయం ప్రతిపత్తి దక్కిందని ఆయన గుర్తుచేశారు. ‘2022 కల్లా కాగితరహిత కార్యలాపాలు నిర్వహించాలన్న కాగ్ నిర్ణయం ముదావహం’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ కార్యక్రమంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి, డిప్యూటీ కాగ్ అనితా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!