అర్హులైన ప్రతి చేనేత కార్మికునికి వైఎస్సార్ నేతన్న నేస్తం

అర్హులైన ప్రతి చేనేత కార్మికునికి వైఎస్సార్ నేతన్న నేస్తం
-: నెల్లూరు కలెక్టరేట్, జూన్ 29 (సదా మీకోసం) :-
అర్హులైన ప్రతి చేనేత కార్మికునికి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా 24 వేల రూపాయలు అందించాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ (ఆసరా) టి.బాపిరెడ్డితో కలిసి.., హ్యాండ్ లూమ్స్, టెక్స్ టైల్స్ అధికారులతో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకంపై సమీక్షా, సమావేశం నిర్వహించారు.
జిల్లాలో తయారవుతున్న చేనేత ఉత్పత్తులకు బ్రాండిగ్ కల్పించాలన్నారు. గతేడాది ఎంతమంది లబ్ది దారులకు నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్దిచేకూరిందని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు.
2020-21 సంవత్సరంలో 6340 మందికి నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ది చేకూరిందని అధికారులు తెలిపారు.
జిల్లాలోని 44 చేనేత సహకార సంఘాలను పునరుద్ధరించాలని, బ్యాంకు అధికారులతో మాట్లాడి చేనేత కార్మికులకు ముద్ర రుణాలు అందించాలని, జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పట్టును, స్థానికంగా ఉన్న నేత కార్మికులకే అందేలా చర్యలు తీసుకుని.., దళారీ వ్యవస్థను నిర్మూలించలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
ప్రతిచేనేత కార్మికుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయా..? లేదా.? అనేది పరిశీలించి.., ఏదైనా పథకం ద్వారా వారికి లబ్ది చేకూరకపోతే అధికారులే వారిచేత దరఖాస్తు చేయించి, ఆ పథకం ద్వారా లబ్ది కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అనర్హులకు నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ది కలిగిందనే ఫిర్యాదులు రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సమీక్షా, సమావేశంలో జడ్.పి. సీఈఓ పి.సుశీల, హ్యాండ్ లూమ్స్ – టెక్స్ టైల్స్ ఎ.డి ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.