డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పార్ట్ - 1

డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఇంట్లో మరియు ఇంటి చుట్టుపక్కల
మంచి నీటి నిల్వలు లేకుండా చూసుకుందాం…….
డెంగ్యూ జ్వరాలు రాకుండా చేసుకుందాం………
సీజనల్ మరియు విష జ్వరాల పేరుతో డెంగ్యూ జ్వరాలు మన రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా విలయతాండవం చేస్తున్నాయి.
కోవిడ్ ఉగ్రరూపాన్ని చవి చూసి ఇప్పుడిప్పుడే కొద్జిగా కోలుకుంటున్న పరితిథులలో ఇప్పుడు వస్తున్న జ్వరం కరోనానా లేక డెంగీ నా తేల్చులేక, ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకోవడానికి మంచం దొరక్క ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, ఆసుపత్రిలో మంచం దొరికినా రక్తనిధులలో రక్తం దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు.ఇది యిప్పటి ప్రజారోగ్య పరిస్థితి.
ఎడిస్ ఈజిప్టై అనే మంచినీటిలో పెరిగే, ఎక్కువగా పగటిపూట కుట్టే దోమ కాటే ఈ డెంగీ జ్వరాలకు కారణం.
డెంగ్యూజ్వరం మనకు రాకుండా ఉండాలంటే మనం రెండు పనులు చేస్తే చాలు. ఈపాడు దోమలు పుట్టకుండా చూసుకోవడం మొదటి పని.పుట్టిన దోమలు మనల్ని కుట్టకుండా చూసుకోవడం రెండవ పని.
ఈదోమ పుట్టకుండా ప్రభుత్వమేచేయాలా?
మనమేమైనా చేయగలమా?
ఈ ప్రశ్నకు ప్రజలు కొంతవరకు చెప్పగలరు .ఎక్కువ సమాధానం ప్రభుత్వం నుంచే రావాలి. దోమలు పుట్టకుండా చేయడంలో ప్రభుత్వానిదే ప్రధాన బాధ్యత.
పారిశుద్ధ్య కార్యక్రమాలను అమలు చేస్తూ వీధులు, గ్రామ వుమ్మడి భాగాలైన బావులు, కొలనుల్లో నీటి నిల్వలు లేకుండా చేసి దోమలు పుట్టకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత.
మన యింట్లో గానీ మన యింటి లోగిలిలో గాని నీటి నిల్వలు లేకుండా చూసుకొని దోమ పుట్టకుండా చూసుకోవడం ప్రజలబాధ్యత.
—————————————————
మనమేం చేద్దాం?
———————–
మన యింట్లో గానీ,
మన యింటి లోగిలిలో గాని,
ఎటువంటి పాత్రల్లో నైనా,
5 రోజులకుమించి నీళ్లు నిల్వ లేకుండా
చూసుకుందాం. ఎందుకంటే కదలిక లేక నిలకడగా ఉన్నటువంటి మంచినీటి లోనే ఈ ఎడిస్ ఈజిప్టై దోమ గుడ్డు పెడుతుంది
___________
మన లోగిలిలో వేటిలో నీళ్లు నిలబడి వుండే అవకాశం వుందో వాటిలో దోమ పుట్టకుండా మనం ఏం చేయాలో చూద్దాం…..
——————————————————
1. నీళ్లు తాగి పడేసిన కొబ్బరి బోండాలు :
ఈ కొబ్బరి బొండాలలో కొన్ని కొబ్బరి నీళ్ళు మిగిలిపోయి ఉండవచ్చు. వర్షం కారణంగా వర్షపు నీరు అందులోకి చేరి ఉండవచ్చు. అలా జరగకుండా నీళ్లు తాగిన తరువాత కొబ్బరి బోండాలను 5 నుంచి 6 ముక్కలు గొ నరికి వేయాలి.
2) పగిలిపోయిన కుండలు:
పగిలిపోయిన కుండలలో నీరు నిల్వ చేసుకోవడానికి మనకు ఉపయోగపడక పోవచ్చు కానీ దోమలు గుడ్లు పెట్టడానికి కావలసిన నీరు నిల్వ ఉండడానికి వీలవుతుంది.పగిలిపోయిన కుండలను కొద్దిపాటి నీరు కూడా నిల్వ ఉండడానికి వీలు కాని విధంగా చిన్న చిన్న ముక్కలుగా పగలకొట్టి పారేయాలి.
3) ఎయిర్ కూలర్లు :
ఎయిర్ కూలర్ ని రోజూ వాడుతుంటే మంచిదే. కూలర్ ని వాడుతున్నప్పుడు అందులో వుండే నీళ్ళలో దోమ గుడ్డు పెట్టదు వాడకుండా వుంటే కూలర్లలోని
నీటిని ప్రతి ఐదు రోజులకు ఒకసారి పారబోసి ఆరబెట్టు కోవడంచేయాలి.
4) స్కూటర్ మరియు సైకిల్ టైర్లు. :
ఉపయోగపడవని ఈ టైర్లను పెరట్లో పారేస్తుటారు. యివి ఈ దోమలు గుడ్లు పెట్టడానికి బాగా ఉపయోగపడతాయి. వీటిలో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు విపరీతంగా పెరుగుతాయి. ఇలాంటివి మన పెరట్లో ఉంటే వాటిని భూమిలో బూడ్చాలి
5) ఇంటి లోపల పెంచుకునే పూలకుండీలు :
పూలకుండీలలో నీళ్లు నిలబడవు.కుండీ కింద నీళ్లు కారిపోకుండా వుంచే ప్లేటులో వుండే నీళ్ళలో ఈ దోమ గుడ్డు పెడుతుంది. నాలుగు రోజులకొక సారి ఆనీటిని తీసి వేయాలి
6) తొట్లు,ఓవర్ హెడ్ టాంకులు :
రోజూ నీళ్లు వాడుకునే తొట్లు, ఓవర్ హెడ్ టాంకులలో ఉండే నీళ్ళలో ఈ దోమ గుడ్డు పెట్టదు.గుడ్డు పెట్టినా ఆ గుడ్డు బ్రతకదు.
మనం ఇంట్లో లేకుండా ఊరికో, టూర్కో వెళ్ళినప్పుడు, ఐదు రోజులకు మించి తొట్లలో నీరు వాడనప్పుడు ఆనీటిలో ఈ దోమ గుడ్డు పెట్టే అవకాశం వుంది.అందుకే ఊరికి పోయేముందు తొట్టిలో నీళ్ళను దొర్లించి వేసి వర్షం వస్తే వర్షపు నీరు తొట్టిలో నిల్వ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తొట్టిని బోళ్ళించాలి. ఓవర్ హెడ్ టాంకిని ఖాళీ చేయడం చేయాలి.
7) వారం రోజుల పాటు నీళ్లు నిల్వ వుంచు కోవలసిన అవసరం వుంటే :
ఇన్ని రోజులు నీళ్లు నిల్వ వుంచడం మంచిది కాదు. తప్పనిసరయితే నిల్వ వుంచిన ప్రతి పాత్ర నుంచి ప్రతి రోజు కనీసం 4 చెంబుల నీళ్లనైనా వాడుకోవాలి. లేదా ఆ పాత్రల్లోని నీళ్ళను కనీసం నాలుగు చెంబులైనా తీసి అందులోనే పోయాల లేదా ఆ పాత్రల్లోని నీళ్ళని నిమిషం పాటు గిలకొట్టాలి.
- యిలా చేయడం వల్ల ఆ పాత్రలో వచ్చిన నీటి కదలిక వలన నీళ్ళ అంచులలోనే ఉండే గుడ్డు మొత్తం చనిపోతుంది.
వీటితో పాటు వాడి పారేసిన టీ కప్పులు, నీళ్ళ గ్లాసులు. గ్రామాల్లో వాడే రోళ్ళు లాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని చారెడు నీళ్లు కూడా నిల్వ ఉండడానికి వీలులేకుండా చేసుకోగల్గితే డెంగ్యూ దోమను, డెంగ్యూ జ్వరాన్ని అదుపులోకి తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు.
___________
దోమ పుట్టకుండా తీసుకునే ఈ జాగ్రత్తల్ని మనం ఒక్కరిమే పాటిస్తే సరిపోదు.
ఈ జ్వర ప్రభావం వున్న ప్రాంతాలన్నీ పాటించాలి.సామూహికంగా ఈ జాగ్రత్తల్ని వారానికి ఒక నిర్నీత ధినాన పాటించడాన్నే “డ్రై డే” అంటాం.
___________
మన ప్రభుత్వం ప్రతి శుక్రవారాన్ని “డ్రై డే” గా ప్రకటించింది.ప్రకటించి కూడా చాలా కాలమైంది. ఆచరణలో యిది జరగడం లేదు.ఆచరింప చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం.ప్రభుత్వం ఆచరింపచేయకపోయినా మన వరకు మనం ఆచరిద్దాం. కొద్దిపాటి సహాయాన్నయినా సమాజానికందిద్దాం.
___________
డాక్టర్ యం. వి. రమణయ్య
9490300431
రాష్ట్ర అధ్యక్షుడు,
ప్రజారోగ్య వేదిక
డెంగ్యూ వచ్చిన రోగు లు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మళ్ళీ తెలుసు కుందాం
డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పార్ట్ - 2 కోసం క్లిక్ చేయండి