యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణ..! -కబ్జా పర్వంలో అధికారుల సహకారం..?

యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణ..!
-కబ్జా పర్వంలో అధికారుల సహకారం..?
తోటపల్లిగూడూరు, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) :
ఎంతో విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురౌతున్నాయి.
కాగా అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయన్న ప్రచారం స్థానికంగా సాగుతోంది.
ప్రభుత్వ భూములు ఆక్రమణ లకు గురౌతున్నాయన్న విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది.
ఆక్రమణ కు గురైన కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి గురించి సేకరించిన మేరకు వివరాలు ఇలా వున్నాయి.
తోటపల్లిగూడూరు మండలం వరిగొండ దేవల్లాలమిట్ట ప్రాంతంలోని సర్వే నెంబరు 1089 లో పూర్తి విస్తీర్ణం య. 2.12 సెంట్లు ప్రభుత్వ భూమి వుంది.
అందులో ఇంప్లిమెంట్ అయిన 0.63 ఎకరాలను మినహాయిస్తే పోను మిగిలిన విస్తీర్ణం య. 1.49 సెంట్లు మథర్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమణలో ఉంది.
ఈ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ విలువ రూ. కోటి నుంచి రూ. కోటిన్నర వరకు వుందని రైతులు చెబుతున్నారు.
ఈ మేరకు ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి విలువ దాదాపు రూ. 2.50 కోట్లకు పైనే వుంటుంది.
కాగా కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైతే సంబందిత రెవిన్యూ శాఖ అధికారులలో “చీమ కుట్టిన” చందంగా కూడా చలనం కనిపించక పోవడం గమనార్హం.
అయితే ఈ ప్రభుత్వ భూమి ఆక్రమణ పర్వంలో తాశిల్దార్ కార్యాలయంలోని సిబ్బందికి భారీగా ముడుపులు అందాయని ప్రచారం కోడై కూస్తోంది.
ముడుపులు అందబట్టే రెవెన్యూ అధికారులు ఆక్రమణ పర్వంపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఆక్రమణలో వున్న భూమిని విడిపించి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.