రంగుల ప్రపంచం వెనకున్న దారుణ నిజాలు
చిత్ర పరిశ్రమ అనేది ఓ మాయా ప్రపంచం. బయటినుంచి చూసేవాళ్లకి అదో రంగులలోకం. ఏమీ లేని స్థాయి నుంచి స్టార్లుగా ఎదిగిన వాళ్లు కొందరుంటే ఎక్కడినుంచి మొదలు పెట్టారో తిరిగి అక్కడికే చేరేవాళ్లు మరికొందరుంటారు. ఒక్క సినిమా హిట్ అయితే రాత్రికి రాత్రే స్టార్లు అయినవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ క్రేజ్ ఎక్కువకాలం నిలవాలంటే మాత్రం కఠోర శ్రమ, గ్లామర్, అదృష్టం..ఇలా అన్నీ కలిసిరావాలి లేదంటే ఇండస్ట్రీలో నెగ్గుకురావడం చాలా కష్టం. ఒకప్పుడు స్టార్లుగా చలామణి అయినవాళ్లు ప్రస్తుతం చాలా సాదాసీధాగా జీవనం గడుపుతున్నారు. ఇంకా చెప్పాలంటే వారి పేర్లు కనుమరుగైనట్లే ప్రస్తుతం ఎక్కడో దిక్కుతోచని, దయనీయమైన పరిస్థితుల్లో జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. అలనాటి బాలీవుడ్ స్టార్ల జీవితాలపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఓపీ నాయర్
మద్యం.. మనుషుల్ని, బంధుత్వాన్ని కూడా దూరం చేయగలదు. అలాంటి కోవలోకే వస్తారు. సంగీత దర్శకుడు ఓపీ నాయర్. మత్తుకు బానిసై కుటుంబాన్ని వదిలిపెట్టాడు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు పనిచేసి ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా గడిపిన నాయర్ ఇప్పుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
జోహ్రాబ్రీన్
సినిమా ప్రపంచం అనగానే నిజంగానే సినిమాల్లో చూపించిన విధంగానే వాళ్లు కుటుంబాలతో సంతోషంగా ఉంటారనుకుంటాం. కానీ అది చాలా కొద్ది మందికే సాధ్యం. చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన జోహ్రాబ్రీన్‌ను ఆమె కొడుకు, కూతురు అనాధలా వదిలేశారు. కుటుంబం కోసం ఎంతో కష్టపడి ప్రతీ పైసా పోగుచేసింది. చివరికి ఆమె చివరి క్షణాల్లో సైతం కుటుంబ సభ్యులు ఎవరూ చేరదీయలేదు. దీంతో అనాథ శవంలానే చనిపోయింది.
పర్వీన్ బాబీ
బాలీవుడ్ పరిశ్రమలో తన అందంతో అలరించిన నటి పర్వీన్ బాబీ. తీవ్రమైన డిప్రెషన్‌తో జనవరి 22,2005లో ముంబైలోని తన ఫ్లాట్‌లో కన్నుమూసింది. దారుణమేంటంటే.. ఆమె అంత్యక్రియలు జరపడానికి రెండు రోజుల వరకు కుటుంబసభ్యులు కానీ ఆత్మీయులు ఎవరూ రాలేదు. దీంతో చివరికి నిర్మాత మహేష్ భట్ ఆమె అంత్యక్రియలు జరిపించే బాధ్యతను తీసుకున్నాడు.
మీనాకుమారి
భారత చిత్ర పరిశ్రమలో ట్రాజెడీ క్వీన్‌గా పిలిచే మీనాకుమారి..తన జీవితంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయంతో జీవితాన్ని ముగించింది. పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ఆమెను పెళ్లి చేసుకోవాలనుకొని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ మీనా కుమారి మాత్రం తను ప్రేమించిన కమల్ అమ్రోహినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత భర్త వేరే మహిళలతో అక్రమ సంబంధాలు తెలిసి మీనా కుమారి గుండె పగిలేలా రోదించింది. చివరికి మద్యానికి బానిసై చనిపోయింది.
రాజ్‌కిరణ్
కార్జ్ చిత్రంంలో రిషికపూర్‌తో పాటు నటించిన హీరో రాజ్‌కిరణ్‌కి కూడా మంచి పాపులారిటినే ఉండేది. అయితే తర్వాత కొన్నేళ్లకు ఆయన ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించకపోవడంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాడేమో అనుకున్నారు. అయితే 2010లో అట్లాంటాలో మతిస్థిమితిం లేని వ్యక్తిలా కనిపించాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ స్థితిలో ఆయన్ను చూసింది రిషికపూరే.
మితాలి శర్మ
భోజ్‌పురి నటిగా ఎంతో ప్రజాదరణ పొందిన నటి మితాలి శర్మ. ఇటీవల ముంబై వీధిల్లో యాచకురాలిగా కనిపించింది. అంతేకాకుండా దొంగతనాలకు పొల్పడుతూ రెండు సార్లు పోలీసులకు చిక్కింది. ఒకప్పుడు అగ్ర హీరోల పక్కన నటించిన మితాలి ఇప్పుడు యాచకురాలిగా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ అయ్యాయి. సినిమా ఆఫర్లను కొన్ని రిజెక్ట్ చేయడంతో మొత్తానికే ఆఫర్లు రావడం ఆగిపోయాయి. దీంతో తీవ్ర నిరాశలో కుంగిపోయింది.
భగవాన్ దాదా
ఖరీదైన కార్లు, బంగళాలు ఉన్న స్టార్ భగవాన్ దాదా పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ఆయన నటించిన జమేలా, లాబెలా వంటి సినిమాలు దారుణంగా పరాజయం కావడంతో బంగ్లా నుంచి ముంబై మురికివాడలకు మారాల్సి వచ్చింది. చివరకు అక్కడే తుదిశ్వాస విడిచారు.
భరత్ భూషణ్
ఉత్తమ నటుడిగా ఎన్నో పాత్రలు పోషించిన భరత్ భూషణ్ మీనాకుమారి లాంటి హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిపారు. తర్వాత కొన్ని సంఘటనల ద్వారా విడిపోయారు. ఆ తర్వాత చివరికి ఆఫర్లు లేక ఫిల్మ్ స్టూడియోలో గేట్ కీపర్‌గానూ పనిచేశాడు. చివరకు అద్దె కట్టుకోలేక అదే ఇంట్లో మరణించాడు.
గీతాంజలి నాగ్‌పాల్
ఎంతో మంది స్టార్లకు డిజైనింగ్ చేసిన సుప్రసిద్ధ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ గీతాంజలి నాగ్‌పాల్ ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో స్టార్ స్థాయికి ఎదిగింది. చివరికి డ్రగ్స్, మద్యానికి బానిసై ఆస్తులన్నీ కుప్పకూలిపోయాయి. దీంతో ఢిల్లీ వీధుల్లో యాచిస్తూ బతుకుతుంది. కొన్ని ఇళ్లలో పనిమనిషిగానూ పనిచేసింది.
జగదీష్ మాలి
ప్రముఖ ఫోటోగ్రాఫర్, నటి ఆండ్రామాలి తండ్రి జగదీష్ మాలి యాచిస్తూ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఒకప్పుడు ఆయన తీసిన ఫోటోలకు తెగ క్రేజ్ ఉండేది. కొన్ని పరిస్థితుల వల్ల ఫోటో స్టూడియోను సైతం అమ్ముకొని యాచిస్తూ కనిపించాడు. ఈ స్థితిలో చూసిన నటుడు సల్మాన్ ఖాన్ ఆర్థిక సహాయం అందించాడు.