16 నుంచి నేను… నా కార్యకర్త : ఎమ్మెల్యే కోటంరెడ్డి
16 నుంచి “నేను… నా కార్యకర్త” : ఎమ్మెల్యే కోటంరెడ్డి
-: నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 14 (సదా మీకోసం) :-
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం నాడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ, “నేను… నా కార్యకర్త” పేరుతో ఈనెల 16 నుంచి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని మొత్తం 26 డివిజన్ల పరిధిలో 42 రోజుల పాటు దాదాపు 3500 కార్యకర్తల నివాసానికి వెళ్లి వారి కుటుంబ పరిస్థితులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకుంటానన్నారు.
కార్యకర్తల కష్టం, వారి త్యాగం తోనే రెండు సార్లు తాను ఎమ్మెల్యే అయ్యానని, తన తాత ,తన తండ్రి ఎమ్మెల్యేలు కాకపోయినా కోట్ల రూపాయల ఆస్తులు లేక పోయినా వేలాది మంది కార్యకర్తల చెమట చుక్కల ఫలితంగానే ఎమ్మెల్యే పదవి వచ్చిందని తెలిపారు.
తనకు 16 సంవత్సరాలు వయసు వచ్చినప్పటి నుంచి కార్యకర్తగా పోస్టర్లను అంటించానని, గోడలపై రాతలు రాశానని, కార్యకర్తల కష్టం తనకు తెలుసని రూరల్ ఎమ్మెల్యే అన్నారు.
కార్యకర్తలు సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని కార్యకర్తలను విస్మరించిన ఏ నాయకుడికి రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఉండదన్నారు.
42 రోజుల పాదయాత్ర కార్యక్రమానికి సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, మురళీ కృష్ణ యాదవ్, మన్నేపల్లి రఘు, షంషుద్దిన్ వ్యవహరిస్తారని తెలిపారు.
కార్యకర్తలు ఎప్పటికప్పుడు తెలియజేసిన విషయాలకు అనుగుణంగా అక్కడ స్థానిక ప్రజా సమస్యలను రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం పరిష్కరిస్తుందన్నారు.