మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు, జీవితాన్ని బలి చేసుకోవద్దు : ఎస్‌.ఇ.బి. జాయింట్ డైరెక్టర్

0
Spread the love

మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు, జీవితాన్ని బలి చేసుకోవద్దు : ఎస్‌.ఇ.బి. జాయింట్ డైరెక్టర్

  • మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలలో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహణ
  • ఒక్కరిని బాగు చేస్తే ఒక కుటుంబాన్ని బాగుచేసినట్లే
  • అక్రమంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు, కఠిన చర్యలు తీసుకుంటాం, ఎవరినీ ఉపేక్షించేది లేదు
  • యువత, విద్యార్థులు చెడు స్నేహాలతో సరదాగా ప్రారంభించిన మాదక ద్రవ్యాల వినియోగం వారి భవిష్యత్‌ ను నాశనం చేస్తుంది
  • మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులను చేస్తున్న సంఘ విద్రోహశక్తుల పట్ల పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉంది
  • SAY NO TO DRUGS – SAY YES TO LIVES
  • ఎట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాల జోలికెళ్ల రాదు..

-: నెల్లూరు క్రైం, జూన్ 26 (స‌దా మీకోసం) :-

మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా జిల్లా అంతట 22.06.2021 నుండి 26.06.2021 వరకు ఎస్‌.ఇ.బి. స్టేషన్స్ మరియు పోలీస్ స్టేషన్ ల పరిధిలో పలు అవగాహన కార్యక్రమాలను ప్రజలలో మరియు యువతను చైత్యన్యం పరిచే విదంగా ప్రణాళికలు సిద్దం చేసి, అమలు పరచడం జరిగిందని ఎస్‌.ఇ.బి. అడిషనల్ యస్.పి. శ్రీలక్ష్మీ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌.ఇ.బి. అడిషనల్ యస్.పి. మాట్లాడుతూ 16.05.2020 న ఎస్‌.ఇ.బి. ఏర్పడినప్పటి నుండి జిల్లా వ్యాప్తంగా 29 గంజాయి కేసులు నమోదు చేసి, 67 మందిని అరెస్ట్ చేసి 7 వాహనాలను సీజ్ చేసినట్లు, అదేవిధంగా గుట్కా అక్రమ రవాణా అరికట్టుటలో మొత్తం 139 కేసులు నమోదు చేసి 252 మందిని అరెస్ట్ చేసి, 4741285 సాచెట్స్, 29 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.

మాదకద్రవ్యాల కేసులలో ఇప్పటి వరకు మొత్తం 22 మంది ముద్దాయిలను బైండోవర్ చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని 15 ఎస్‌.ఇ.బి. స్టేషన్ ల పరిధిలోని మండలాలలో మాదకద్రవ్యాల నిర్మూలన, దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, పాత నేరస్తులకు కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

ప్రపంచ మానవాళికి పెనుభూతంలా పరిణమించిన మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత తమ విలువైన భవిష్యత్తును పాడుచేసుకొంటున్నారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గంజాయి, గుట్కా తదితర మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత యొక్క ఆరోగ్యానికి కలిగే నష్టాలను గురించి, భవిష్యత్తులో ఏవిధంగా వారి జీవితాలు పాడవుతాయని తెలియ జేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

ప్రతి స్టేషన్ లో పోస్టర్ లు, ప్లేక్సీలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరుస్తూ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు.

నెల్లూరు సబ్ డివిజన్ లో 14 మంది పాత ముద్దాయిలను బైండోవర్ చేసుకున్నట్లు, గూడూరు సబ్ డివిజన్ లో 8 మంది పాత ముద్దాయిలను బైండోవర్ చేసుకున్నట్లు తెలిపారు.

స్పెషల్ డ్రైవ్ సందర్భంగా 22.06.2021 నుండి 26.06.2021 వరకు జిల్లాలోని జాతీయ మరియు రాష్ట్ర రహదారులు అయిన బి.వి. పాలెం చెక్ పోస్టు, వెంకటాచలం, బూదనం, చిల్లకూరు, గౌరవరం టోల్ ఫ్లాజాల వద్ద వాహనాలను ఆకస్మిక తనిఖీ కార్యక్రమాలు నిర్వహించినట్లు, కేసులో చిక్కుకున్నప్పటికీ పదే పదే నేరాలకు పాల్పడే వారిపై సస్పెక్ట్ షీట్స్ తెరుస్తూ వారి పాలిట సింహ స్వప్నం లో మారారని తెలిపారు.

అనంతరం ఎస్‌.ఇ.బి. అడిషనల్ యస్.పి. గారు మాట్లాడుతూ విచ్చలవిడి తనానికి అలవాటు పడి మాదకద్రవ్యాలకు బానిసలవుతున్న యువత మేల్కొని వారి జీవితాలను చక్కదిద్దుకోకపోతే అదే మాదక ద్రవ్యాలకు బలైపోతారని, మత్తు వదలకపోతే బ్రతుకులు చిత్తైపోతాయని ఉద్బోదించారు.

మొదట్లో తమాషాగా తీసుకునే ఈ మత్తుపదార్థాలు ఆ తరువాత వారే దానికి బానిసలుగా మారిపోతుంటారని అన్నారు. అది నేర ప్రవృత్తివైపు కూడా ప్రేరేపిస్తుందని చెప్పారు.

మాదక ద్రవ్యాలు విక్రయించి సొమ్ము చేసుకుందామని కోట్లు గడిద్దామని ఎవరైనా భ్రమ పడి అమాయక యువకులు, విద్యార్థులను ప్రలోభపెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

డ్రగ్స్‌ ప్రధానంగా నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతాయని, వీటిని వాడే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా దుష్ప్రభావాలు చూపుతాయని వివరించారు.

రోగనిరోధక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థలు బాగా దెబ్బతిని చివరకు అకాల మరణాలకు కూడా కారణం అవుతాయని తెలియజేశారు.

శరీరంలో ప్రధాన అవయవాలైన గుండె, మెదడు, లివర్ , ఊపిరితిత్తుల పని తీరు మందగించి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తాయని సూచించారు.

రక్తనాళాలు కుంచించుకుపోవడం, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడటం, జ్ఞాపకశక్తి క్షీణించడం, ఏకాగ్రత లోపించడం, పక్షవాతం రావడం, తదితర దుష్ఫరిణాలు తలెత్తి జీవితమే నాశనమయ్యే ప్రమాదముంటుందని సూచించారు.

కొకైన్‌, హెరాయిన్‌, బ్రౌన్‌షుగర్‌, చెర్రస్‌, గంజాయి, నల్లమందు తదితర మత్తు పదార్థాలకు అలవాటుపడితే దేహాన్ని మనకు తెలియకుండానే అవి పీల్చిపిప్పి చేస్తాయి.

అంతేకాదు తనపై నియంత్రణ కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తించేలా చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాల జోలికెళ్ల రాదని తెలియజేశారు.

ముఖ్యంగా కాలేజీలకు వెళ్తున్న విద్యార్థులపై తల్లిదండ్రులు శ్రద్ద తీసుకోవాలని, అవారాగా తిరుగుతున్న వారి తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని కోరారు.

వారు ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్రవర్తనలో ఉన్నారో తెలుసుకుంటూ ఉండాలని సూచించారు. లేకుంటే మీ కుటుంబాలు ఛిద్రమౌతాయన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని ఈ సందర్బంగా SEB అడిషనల్ యస్.పి గారు సూచించారు.

జిల్లావ్యాప్తంగా ఉన్న 15 ఎస్‌.ఇ.బి., L&O పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమ మద్యం, ఇసుక రవాణాకు పాల్పడుతూ, ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులైన గుట్కా, పాన్ వంటివాటి విక్రయాలకు, నిల్వలను కలిగివున్న, గంజాయి ఇతర మాదక ద్రవ్యాల రవాణా కు సహకరిస్తున్న, ప్రజారోగ్యాన్ని పాడుచేసే నాటుసారా మహమ్మారి తయారీని స్వాగతిస్తున్న అక్రమార్కులపై అనేక మార్లు కేసులు నమోదు చేసినప్పటికీ వారిలో మార్పు లేకపోవడంతో, వారందరిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!