మ‌త ఘర్షణల వల్ల ప్రమాదంలో సెక్యులరిజం: సీజేఐ ఎన్వీ రమణ

0
Spread the love

మ‌త ఘర్షణల వల్ల ప్రమాదంలో సెక్యులరిజం: సీజేఐ ఎన్వీ రమణ

-: న్యూఢిల్లీ, సెప్టెంబ‌ర్ 12 (స‌దా మీకోసం) :-

స్వామి వివేకానందుడు చికాగోలో చేసిన చారిత్రాత్మక ప్రసంగానికి 129 సంవత్సరాలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని వివేకానంద మానవ వికాస కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుని 22 సంవత్సరాలు ముగిసింది.

ఈ సందర్భాలను పురస్కరించుకుని వివేకానంద మానవ వికాస కేంద్రం ఏర్పాటు చేసిన వెబినార్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు.

స్వామి వివేకానందుడి బోధనలను స్మరించారు. ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాల్సి ఉందని చెప్పారు

స్వామి వివేకానందుడు తన చికాగో ప్రసంగంలో.. భారత ఆత్మను ఆవిష్కరించారని ఎన్వీ రమణ అన్నారు. ప్రాచీన భారత్ అనుసరించిన వేదాంతాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లగలిగారని చెప్పారు.

మత స్వేచ్ఛ, సహనం అనేవి ప్రతి ఒక్కరికీ ఉండాలని సూచించారని చెప్పారు.

ఇప్పటి సమాజంలో అలాంటి పరిస్థితులు లేవని స్పష్టం చేశారు.

మూఢ నమ్మకాలు సమాజాన్ని ఆవరించుకున్నట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వివేకానందుడు సూచించిన మతం అనేది..అంధ విశ్వాసాలకు అందనంత ఎత్తున ఉండాలని అన్నారు.

కొన్ని అర్థం లేని మత ఘర్షణల వల్ల సెక్యులరిజం ప్రమాదంలో పడినట్టు కనిపిస్తోందని ఎన్వీ రమణ చెప్పారు. ఇప్పటి సమాజానికి, జాతీయవాదానికి అర్థ రహితమైన మత ఘర్షణల నుంచి ప్రమాదం పొంచివుందని అన్నారు.

ఇప్పుడు ఉన్న సమాజానికి.. స్వామి వివేకానందుడు చికాగోలో చేసిన ప్రసంగాల సారాంశం అత్యవసరమని చెప్పారు. వివేకానందుడి బోధనలను పాటించాల్సి ఉందని అన్నారు.

నిజమైన మతం.. సహనం, సమానత్వాన్ని బోధిస్తుందని అన్నారు.

బిర్సా ముండా, భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, మన్యం వీరుడు అల్లూరి సీీతారామరాజు వంటి పోరాటయోధులు చరిత్రలో నిలిచిపోయారని, దీనికి అందరినీ సమానదృష్టితో చూడటమే కారణమని అన్నారు. నేటి యువత వారిని, వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్వీ రమణ సూచించారు.

బ్రిటీషర్లపై పోరాటం చేయడానికి బిర్సా ముండా గిరిజన సామాజిక వర్గం యువతను ఏకం చేశారని, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు.. తుదిశ్వాస వరకూ తిరుగులేని పోరాటం సాగించారని పేర్కొన్నారు.

దేశ జనాభాలో 45 శాతం మంది యువతీ యువకులే ఉన్నారని, దేశాన్ని నడిపించాల్సిన బాధ్యత వారిపై ఉందని ఎన్వీ రమణ గుర్తు చేశారు.

15 నుంచి 35 మధ్య వయస్సు ఉన్న వారు 65 శాతం వరకు ఉన్నారని, సమాజంలో మార్పును తీసుకుని రావడానికి మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

యువత.. గ్రామాలు, మురికివాడలను సందర్శించడం ఎంతో అవసరమని ఎన్వీ రమణ అన్నారు.

అక్కడి పరిస్థితులను సమూలంగా మార్చివేయడానికి తమకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అన్నారు.

చట్టాన్ని గౌరవించడం, నిజాయితీగా వ్యవహరించడం, న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కలిగించేలా సంస్కృతిని యువత మరింత పెంపొందించుకోవాలని అన్నారు.

తాను గ్రామీణ నేపథ్యం నుంచే వచ్చానని, చదువుకునే సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నానని అన్నారు.

వాటన్నింటినీ అధిగమించి దేశ అత్యున్నత న్యాయ పదవిని చేపట్టే స్థాయికి చేరుకున్నానని చెప్పారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, ఆధునిక సాకేంతిక పరిజ్ఞానం వల్ల చదువుకోవడానికి అనేక సౌకర్యాలు ఏర్పడ్డాయని అన్నారు.

తమ మేధోసంపత్తిని యువత.. సమాజాన్ని సానుకూల దిశగా తీసుకెళ్లడానికి వినియోగించాలని సూచించారు. ఇలాంటి భారత్‌ను వందేళ్ల కిందటే స్వామి వివేకానందుడు తన చికాగో ప్రసంగంలో సాక్షాత్కరింపజేశారని ఎన్వీ రమణ అన్నారు.

ఆయన బోధనలను కార్యరూపంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని ఆయన గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!