శిక్ష తప్పదనే మంత్రి కాకాణి కోర్టులోని ఆధారాలను లేపేశారు : సోమిరెడ్డి

0
Spread the love

శిక్ష తప్పదనే మంత్రి కాకాణి కోర్టులోని ఆధారాలను లేపేశారు

  • ఒక క్రిమినల్ కేసులోని ముద్దాయిలు ఏకంగా కోర్టులోని సాక్ష్యాధారాలను దొంగలించడం దేశచరిత్రలోనే తొలిసారి
  • కోర్టులకే రక్షణ లేనప్పుడు ఇక సాక్షులకు భద్రత ఎక్కడిది…
  • ఇది ఆషామాషీ కేసు కాదు..ఈ కేసును హైకోర్టు తీవ్రంగా పరిగణించి వెంటనే నిందితుల బెయిల్ రద్దు చేయాలి
  • మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు ప్ర‌తినిధి, ఏప్రిల్ 15 (స‌దా మీకోసం) :

నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలోని 4వ అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దొంగలు పడి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముద్దాయిగా ఉన్న నకిలీ డాక్యుమెంట్ల కేసుకు సంబంధించి ఆధారాలను దొంగలించడంపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కావలి ఇన్ చార్జి మాలేపాటి సుబ్బానాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, తిరుపతి పార్లమెంట్ రైతు విభాగం అధ్యక్షులు రావూరి రాధా కృష్ణమ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు సన్నా రెడ్డి సురేష్ రెడ్డి,గుమ్మడి రాజా యాదవ్, తెలుగు యువత అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు తదితరులు కోరారు.

ఈ సంద‌ర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, మా కుటుంబానికి విదేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులున్నాయంటూ నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ వీసాలు, నకిలీ పాస్ పోర్టులను 2017లో మీడియా ముందు పెట్టిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.

నకిలీ పత్రాల ముఠాతో చేతులు కలిపి మా కుటుంబాన్ని దెబ్బతీయాలని ఈనాటి మంత్రి అప్పట్లో కుట్ర చేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణించానన్నారు. క్రిమినల్ కేసుతో పాటు సివిల్ డిఫర్మేషన్, క్రిమినల్ డిఫర్మమేషన్ దావాలు కూడా వేశానని తెలిపారు.

అప్పట్లో పోలీసులు ఈ సంచలనాత్మక కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు నెలల్లోనే నకిలీ డాక్యుమెంట్ల వెనకున్న కుట్రను చేధించారు..నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసిన ఫొటో స్టూడియోను గుర్తించి ఆధారాలను కూడా సీజ్ చేసి ముద్దాయిలను అరెస్ట్ చేశారన్నారు.

ఏ1 ముద్దాయి, ప్రస్తుత మంత్రి గోవర్ధన్ రెడ్డి మాత్రం అప్పట్లో రెండు నెలలు కనిపించకుండా పారిపోయి సుప్రీంకోర్టు నుంచి కండిషన్ బెయిల్ తెచ్చుకున్నారని, రెండు నెలలు రోజూ రూరల్ పోలీసు స్టేషన్ కు వెళ్లి కానిస్టేబుల్ వద్ద వంగివంగి సంతకం పెట్టివచ్చారని తెలిపారు.

కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉన్న ఈ కేసును మూడు నెలల క్రితం ఉపసంహరించుకుంటూ విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో రాష్ట్రప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసిందని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ కేసును ఉపసంహరించుకోవడం కుదరదని రాష్ట్రప్రభుత్వానికి ప్రత్యేక కోర్టు మొట్టికాయలు వేసిందన్నారు.

పక్కా ఆధారాలు, సాక్ష్యాలు ఉన్న ఈ కేసు మరో నెలలో న్యాయస్థానం ముందు విచారణకు రానుందని, ముద్దాయిలకు శిక్షలు పడుతాయని కూడా మాకు పూర్తి నమ్మకముంద‌ని, శిక్ష పడితే జైలు ఊచలు లెక్కపెట్టడంతో పాటు మంత్రి పదవి ఊడటం ఖాయమని భావించి తనను కాపాడుకునేందుకు కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టులో ఉన్న డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్, నాలుగు సెల్ ఫోన్లను మాయం చేయించేశారని విమ‌ర్శించారు.

అప్పట్లో నిందితుల మధ్య జరిగిన సంభాషణలు, మెసేజ్ లు, ఇతర ఆధారాలన్నీ ఉన్న ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను లేపేశారని, నకిలీ మద్యం, నకిలీపత్రాలు, ఫొటోలు మార్పింగ్ లో ఆరితేరిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు ఏకంగా కోర్టు లాకర్ లో ఉన్న ఆధారాలనే దొంగతనం చేసాడన్నారు.

దేశ చరిత్రలోనే తొలిసారి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ముద్దాయిలకు వెంటనే బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టులో భద్రంగా ఉండాల్సిన ఫైళ్లకే దిక్కులేకపోతే ఇక సాక్షుల సంగతి దేవుడెరుగు అన్నారు. విచారణ ప్రారంభమయ్యే సమయానికి సాక్షులను లేపేసినా ఆశ్చర్యం లేదన్నారు.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!