పర్సంటేజీల కోసమే పెన్నా బ్యారేజీ కాపర్ డ్యాంను తెగ్గొట్టారా…మంత్రి అనిల్ గారూ….. : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

0
Spread the love

పర్సంటేజీల కోసమే పెన్నా బ్యారేజీ కాపర్ డ్యాంను తెగ్గొట్టారా…మంత్రి అనిల్ గారూ…..

  • సోమశిల నుంచి వదలకపోతే నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి..
  • ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రి అనిల్ దే..
  • ఇరిగేషన్ మంత్రి అనిల్, అవినీతి అక్రమాలను వదిలేప్రసక్తే లేదు..వెంటాడుతాం..
  • తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి..

-: నెల్లూరు నగరం, ఆగష్టు 29 (సదా మీకోసం) :-

తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆదివారం వీడియో ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, నెల్లూరులోని పెన్నా బ్యారేజీ కాపర్ డ్యాం కొట్టుకుపోయిన ఘటన దురదృష్టకరమన్నారు.

అదృష్టవశాత్తు అనేక మంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, వారిని రక్షించిన పోలీసులు, ఫైర్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

10 శాతం పనులను 3 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి అనిల్ ప్రగల్భాలు పలికారని, మూడు నెలలు, ఆరు నెలలు అంటూ రెండున్నర ఏళ్లుగా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారని విమర్శించారు.

కాపర్ డ్యాం కొట్టుకుపోతే నీటిపారుదల శాఖ అధికారులు ఏమైపోయారని, సోమశిల జలాశయం నుంచి చుక్క నీరు వదలకపోతే కాపర్ డ్యాంఎలా కొట్టుకుపోయిందని ప్రశ్నించారు.

నీటి విడుదల జరగకపోతే జొన్నవాడ నుంచి పొట్టేపాళెం వరకు ఉన్న నీళ్లు ఎక్కడివో మంత్రి అనిల్ ప్రజలకు సమాధానం చెప్పాలని, సోమశిల జలాశయంలో నీటి మట్టం 60 టీఎంసీలు దాటింది. గత ఏడాది జరిగిన డ్యామేజీకి ఇంకా మరమ్మతులు చేయలేదన్నారు.

మీ నిర్లక్ష్యం కారణంగా సోమశిల డ్యాంకు ముప్పు ఏర్పడితే బాధ్యులు ఎవరు, రెండున్నరేళ్లుగా పెన్నా బ్యారేజీ పనులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.

అసమర్ధ, అవినీతి ఇరిగేషన్ మంత్రి కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని, సర్వేపల్లి కాలువ నుంచి పెన్నా బ్యారేజీ వరకు మీరు ఎంత దాచిపెట్టినా మీ అవినీతి దాగదన్నారు.

ఇంత జరిగితే నీటి పారుదల శాఖ అధికారులు కనీసం ఆ ప్రాంతానికి వచ్చారా…ఒక స్టేట్మెంట్ అయినా ఇచ్చారా.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇరిగేషన్ మంత్రికి, ఆ శాఖ అధికారులకు లేదా.. అని ప్రశ్నించారు.

పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులకు ఏం తెలుసని వారితో స్మేట్మెంట్లు ఇప్పిస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే తెలుగుదేశం పార్టీ ఊరుకోదని తెలిపారు.

పెన్నా బ్యారేజీ కాపర్ డ్యాం ఎందుకు తెగిందో ప్రజలకు సమాధానం చెప్పాలిన బాధ్యత మంత్రి అనిల్ పైనే ఉందని, మంత్రి అనిల్ అవినీతి, అక్రమాలను వదిలే ప్రసక్తే లేదని..తెలుగుదేశం పార్టీ వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!