జులై 1 నుండి 7వ‌ర‌కు కాపు నేస్తం ల‌బ్దిదారుల న‌మోదు కార్య‌క్ర‌మం

0
Spread the love

జులై 1 నుండి 7వ‌ర‌కు కాపు నేస్తం ల‌బ్దిదారుల న‌మోదు కార్య‌క్ర‌మం

-: నెల్లూరు క‌లెక్ట‌రేట్‌, జూన్ 29 (స‌దా మీకోసం) :-

జులై ఒకటో తేదీ నుండి 7వ తేదీ వరకు కాపు నేస్తం లబ్ధిదారుల నమోదు కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.

మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వారి ఛాంబర్లో “కాపు నేస్తం, స్మైల్ పథకాల పై” సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే జులై 24వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్సార్. ఆర్. కాపు నేస్తం పథకం కింద రెండో విడతగా ఒక్కో లబ్ధిదారునికి 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం విడుదల చేయనున్నారన్నారు.

ఇందులో భాగంగా వచ్చే జులై 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు 45 నుండి 60 సంవత్సరాలు లోపు వయస్సు కలిగిన అర్హులైన మహిళ లబ్ధిదారుల ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని వార్డు, గ్రామ వాలంటీర్ ల ద్వారా చేపట్టి మొబైల్ అప్లికేషన్స్ తో లబ్ధిదారుల వివరాలను సేకరించాలన్నారు.

అనంతరం జూలై ఎనిమిదో తేదీ నుండి 13వ తేదీ వరకు పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టి జూలై 14వ తేదీన చివరి అర్హుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించాలన్నారు.

జూలై 15వ తేదీన అర్హులైన లబ్ధిదారుల జాబితాను నిర్ధారించి సంబంధిత ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు నుండి రాబట్టాలని అన్నారు.

జూలై 16వ తేదీన తన వద్ద ఆమోదం తీసుకుని ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలన్నారు. జిల్లాలో మొదటి విడతలో 7520 మంది లబ్ధిదారులకు కు 11.28 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందన్నారు.

కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో ప్రభుత్వం స్మైల్ పథకం కింద ఎన్.ఎస్.ఎఫ్. డి.సి., ఎన్.బి. సి.ఎఫ్. డి. సి.ల ద్వారా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం స్వయం ఉపాధి కోసం అందిస్తోందన్నారు.

బీసీ కార్పొరేషన్కు 404 దరఖాస్తులు అందగా అందులో అర్హత ఉన్న 354 దరఖాస్తులను ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు.

అలాగే ఎస్సీ కార్పొరేషన్ కు అందిన 355 దరఖాస్తులను ప్రభుత్వానికి పంపామన్నారు ఈ స్మైల్ పథకం కింద ప్రయోజనం పొందాలంటే లబ్ధిదారుల కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయల లోపు ఉండాలని, వయస్సు 18 నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలని స్పష్టం చేశారు.

సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఆసరా బాపిరెడ్డి ,బీసీ కార్పొరేషన్ ఈడీ కృష్ణా రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈవో సెల్వి తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!