జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యంతోనే ఉదయగిరి నారాయణ కుటుంబానికి న్యాయం : మాజీ మంత్రి సోమిరెడ్డి

0
Spread the love

జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యంతోనే ఉదయగిరి నారాయణ కుటుంబానికి న్యాయం : మాజీ మంత్రి సోమిరెడ్డి

  • వారు స్పందించే వరకు జిల్లా అధికారుల్లో చలనం లేకుండా పోయింది
  • నారాయణ కుటుంబసభ్యుల తరఫున ఎస్సీ కమిషన్ కు ధన్యవాదములు తెలియజేస్తున్నాం
  • ఎస్సై కరిముల్లా ఆకృత్యాలపై త్వరలోనే మైనార్టీ కమిషన్ ను కూడా ఆశ్రయించబోతున్నాం
  • జిల్లాలో ప్రధానంగా నెలకొన్న మూడు భయానక సమస్యలపై వామపక్షాలు, జనసేన, బీజేపీతో పాటు ప్రజాసంఘాలతో కలిసి ఉమ్మడి పోరాటానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం
  • మా పోరాటం ఓట్ల కోసం కాదు…వైసీపీ ప్రభుత్వ అరాచక, నియంతృత్వ, నిరంకుశ పాలనలో అన్యాయానికి గురవుతున్న ప్రజలకు న్యాయం చేయడం కోసమే

నెల్లూరు రూరల్, ఆగస్టు 7 (సదా మీకోసం):

అల్లీ పురం లోని తన నివాసంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించి తన కుటుంబానికి న్యాయం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అల్లీపురంలోని నివాసంలో ఉదయగిరి నారాయణ సతీమణి పద్మమ్మ తన పిల్లలతో కలిసి ధన్యవాదములు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పోలీసుల దారుణాలు విపరీతంగా పెరిగిపోయాయి..నూటికి 40 శాతం మంది దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారన్నారు.

మిగిలిన 60 శాతం మందిపై అధికార పార్టీ నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

ఎమ్మెల్యేలు ఏమి చెబితే అదే ఎస్సైలు, సీఐలు చేస్తున్నారు…డీఎస్పీలు పూర్తిగా చేతులెత్తేశారు..పోలీసులు ఏమి తప్పులు చేసినా ఎస్పీ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.

నెల్లూరు జిల్లాలో సుదీర్ఘ కాలంగా రాజకీయ పోరాటాలు కొనసాగుతున్నాయి. కానీ ఇలాంటి అకృత్యాలు, దుర్మార్గాలు ఏనాడు లేవు అన్నారు.

మానవ హక్కులకు భంగం కలుగుతున్నాయి…సగటు మానవుడు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితి నెలకొందని చెప్పారు.

ఉదయగిరి నారాయణ కుటుంబానికి జరిగిన అన్యాయం విషయంలో ఈ రోజు జాతీయ ఎస్సీ కమిషన్ కానీ ఆదుకోకుండా ఉంటే అతని భార్య, ముగ్గురు బిడ్డలు, దివ్యాంగురాలైన చెల్లి, తల్లి కలిపి ఆరుగురు దళిత బిడ్డలు అనాథలైపోయివుండే వారిని తెలిపారు.

ఎంత చేసినా నారాయణ లేని లోటును ఆ కుటుంబానికి ఎవరూ తీర్చలేరన్నారు.

జూన్ 19న ఉదయగిరి నారాయణ ఉరికి వేలాడుతూ కనిపించారు. 20వ తేదీన భార్య పద్మావతితో బలవంతంగా సంతకం తీసుకుని అన్ సస్పెక్టెడ్ కింద కేసు మూసేశారని తెలిపారు.

మేమంతా వెళ్లి పోస్టుమార్టం వద్ద కూర్చున్నాం…పోలీసులు కొట్టిన దెబ్బలు తీవ్రంగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో పీఎం రిపోర్టు కూడా న్యాయంగా ఇస్తారనుకున్నాం..కానీ అధికార పార్టీ ఒత్తిళ్లతో అక్కడ కూడా అన్యాయం జరిగిందన్నారు.

మర్మాంగాలు, ఛాతీపై తగిలిన ప్రధాన గాయాలను పీఎం రిపోర్టులో చూపలేదని, రీపోస్టుమార్టం చేయిస్తారనే ఉద్దేశంతో 40 మంది పోలీసుల నిర్బంధం మధ్య కుటుంబ సంప్రదాయాలకు విరుద్ధంగా మృతదేహాన్ని దహనం చేయించారని తెలిపారు.

దళిత కుటుంబానికి జరిగిన ఈ అన్యాయంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా స్పందించింది..మాజీ మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు, నాయకులు, జిల్లా నేతలు నెల్లూరుకు చేరుకుని ఎస్పీని తీవ్రంగా నిలదీశారని పేర్కొన్నారు.

విధిలేని పరిస్థితుల్లో అప్పటికప్పుడు ముందు తేదీ వేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా బ్రిక్స్ ఫ్యాక్టరీ యజమాని ఒక్కడిపై కేసు నమోదు చేశారు..అట్రాసిటీ కేసులోనూ అతనొక్కడినే పరిమితం చేశారన్నారు.

బ్రిక్ ఫ్యాక్టరీ యజమాని ఇచ్చిన చోరీ కేసును పోలీసులు ఎప్పుడు నమోదు చేసుకున్నారు..ఆ ఫ్యాక్టరీకి ఉన్న అనుమతులు, లేబర్ శాఖ గుర్తింపుపై పోలీసులు ఆరా తీశారా అని ప్రశ్నించారు.

అవన్నీ వదిలేసి ఉరికి వేలాడుతున్న నారాయణ మీద 19వ తేదీ దొంగతనం కేసు నమోదు చేస్తారా..భర్త చనిపోయి బాధలో ఉన్న పద్మమ్మతో బలవంతంగా సంతకాలు చేయించుకుంటారా అని ప్రశ్నించారు.

గత 15 రోజులుగా పిల్లలను స్కూల్లో చేర్పించడం కోసం నారాయణ డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని పద్మమ్మ సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఇవ్వలేదని చెప్పారు.

నారాయణ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు స్మేట్మెంట్ ఇస్తేనే డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తామని పంచాయతీ కార్యదర్శి బెదిరించారని, ఈ పరిస్థితుల్లో ఉదయగిరి నారాయణది కచ్చితంగా హత్యే…పోలీసులే కొట్టి చంపేశారని మేము జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించామని వివరించారు.

ఢిల్లీలో ఎస్సీ కమిషన్ విజయ్ శాంప్లాను నేను, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు కలిశామని, కమిషనర్ వెంటనే స్పందించి డైరెక్టర్ సునీల్ కుమార్ ను విచారణ నిమిత్తం నెల్లూరుకు పంపారన్నారు.

ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ వస్తున్నారనే విషయం తెలియగానే హడావుడిగా ఇంటికొచ్చి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారని, రాత్రికి రాత్రే పద్మమ్మ బ్యాంకు ఖాతాలో రూ.4.12 లక్షలు జమ చేశారని తెలిపారు.

నెల రోజులుగా ఆ కుటుంబాన్ని వివిధ రూపాల్లో తీవ్రంగా వేధిస్తూ ఇబ్బందులు పెట్టిన అధికారులు ఎస్సీ కమిషన్ డైరెక్టర్ రాగానే ప్రభుత్వ పాలిటెక్నిక్ లో నియమిస్తూ ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. రూ.5 వేలు పింఛన్ మంజూరు చేశారు. 18 అంకణాల ఇంటి స్థలం ఇచ్చారు. ఇప్పుడు రూ.4.12 లక్షలు అకౌంట్లో వేశారు..చార్జిషీటు ఫైల్ అయ్యాక మరో రూ.4 లక్షలు అకౌంట్లో జమ చేస్తామన్నారు. మూడు ఎకరాల భూమిని త్వరలోనే మంజూరు చేస్తామని, పిల్లలకు గ్రాడ్యుయేషన్ వరకు న్యాయమైన విద్య అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ పోరాటం చేసే వరకు, దళిత నేతలంతా కదలివచ్చేంత వరకు, టీడీపీ ఛలో నెల్లూరుకు పిలుపునిచ్చేంత వరకు, ఎస్సీ కమిషన్ డైరెక్టర్ నెల్లూరు వచ్చేంత వరకు జిల్లా అధికారులు స్పందించరా అని ప్రశ్నించారు.

ఒక దళిత యువకుడు, ఇద్దరు ముస్లిం యువకుల చావుకు కారణమైన ఎస్సైని వదిలిపెట్టే ప్రసక్తే లేదు…త్వరలో సాక్ష్యాధారాలతో మైనార్టీ కమిషన్ ను కూడా ఆశ్రయించబోతున్నాం అని తెలిపారు.

జిల్లాలో ఒక రకంగా ఆటవిక రాజ్యం కొనసాగుతోంది. ఈ ఎస్సై కరిముల్లా కొట్టినదెబ్బలకు అనికేపల్లిలో ఒక గిరిజన యువకుడి మానసిక పరిస్థితి దెబ్బతింది. చివరకు ఉన్న భూమిని అమ్ముకుని చికిత్స పొందాల్సివచ్చిందని తెలిపారు.

మర్రిపాడులోనూ ఒక ఎస్సై అకృత్యాలు సంవత్సరాలుగా జరగుతుంటే అ అధికారిని టచ్ చేసే ధైర్యం జిల్లా అధికారులకు లేకుండా పోయింది. నేను డీజీపీ లెటర్ రాసిన తర్వాత ఆ ఎస్సైతో పాటు ఒక ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారని, డీజీపీ స్పందించేంత వరకు ఈ జిల్లాలో ఎస్పీ ఏం చేస్తున్నారని, ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు జిల్లాను ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు.

మొన్న ముత్తుకూరులో ఒక ఎస్సై నడిరోడ్డుపై సెటిల్మెంట్ చేసిన వ్యవహారంపై జిల్లా ఎస్పీని ఫోన్ లో ప్రశ్నిస్తే ఆయనకు కౌన్సిలింగ్ చేస్తామని సమాధానం ఇచ్చారన్నారు.

ఒక ఎస్సై పట్టపగలు రూ.2 లక్షలు, రూ.5 లక్షలని ప్రాణాలకు వెలగట్టి సెటిల్మెంట్లు చేస్తుంటే జిల్లాలో రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్రలో ఒక ఫ్యాక్టరీలో విష వాయువులు లీకై చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం మంజూరు చేశారు..మరో చోట రూ.50 లక్షలు, ఇంకో చోట రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించారు..ఇక్కడ మాత్రం రూ.5 లక్షలు బిచ్చమేస్తారా అని ప్రశ్నించారు.

అమాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తుంటే, చంపేస్తుంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం అని తెలిపారు.

నిన్న నెల్లూరులో వామపక్షాల నేతలతో సమావేశమయ్యాం..త్వరలోనే బీజేపీ, జనసేన నేతలను కూడా కలుస్తాం అని తెలిపారు.

జిల్లాలో ప్రధానంగా నెలకొన్న మూడు భయానక సమస్యలపై ఉమ్మడి పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

రైతులు పండించిన పంటకు మద్దతు ధర, పోలీసులు అరాచకాలు, క్రిష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణ అంశాలపై పోరాటానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం అని తెలిపారు.

మా పోరాటం ఓట్ల కోసం కాదు…జిల్లాలో అధికార పార్టీ నేతలు, పోలీసుల అరాచాకం కారణంగా అన్యాయానికి గురైన కుటుంబాలకు న్యాయం చేయడం కోసమే ఉద్యమిస్తున్నాం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, చేజెర్ల వెంకటేశ్వర్లురెడ్డి , తాళ్ళపాక అనురాధ, జెన్నీ రమణయ్య, బద్దెపూడి రవీంద్ర, మాతంగి కృష్ణ , కప్పిర శ్రీనివాసులు , పనబాక భూలక్ష్మి , అరవకిశర్ , సాబీర్ ఖాన్ , మౌనుద్దీన్ ,అమ్రుల్లా ,రేవతి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!