అకాల వర్షాలకు రైతులు కొన్ని సూచనలు పాటించండి : డాక్టర్ జి. ఎల్. శివజ్యోతి
అకాల వర్షాలకు రైతులు కొన్ని సూచనలు పాటించండి
ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జి. ఎల్. శివజ్యోతి
నెల్లూరు ప్రతినిధి, అక్టోబర్ 16 (సదా మీకోసం) :
అకాల వర్షాలలో రైతులు పంటను రక్షించుకోడానికి పాటించవలసిన సూచనలతో నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జి ఎల్ శివజ్యోతి ఒక ప్రకటన విడుదల చేశారు.
“ప్రస్తుతం జిల్లాలో వర్షాలు ఎక్కువగా ఉన్నందున వరి కోతలు కోసిన రైతులు కళ్లాలపై వున్న ధాన్యాన్ని తడవకుండా ప్లాస్టిక్ షీట్లతో కప్పి భద్రపరచుకోవాలి.
అధిక వర్షాలు కురిసే ప్రాంతాలలో కోత దశలో వున్న వరి పొలాల నుంచి అధికంగా నిలిచిన నీటిని వెంటనే తీసివేయాలి.
నారు మడులలో, ఇప్పుడే నాట్లు వేసిన, ప్రధాన పొలాలలో అధిక వర్షం కురిసి నీరు నిల్వ వుండే పక్షంలో వెంటనే ఆ నీటిని పొలం నుండి వెలుపలికి పంపాలి.
నేరుగా విత్తే వరి, డ్రమ్ సీడర్ లో వరి విత్తుట వంటి పనులు రెండు మూడు రోజులు ఆగి ఆ తరువాత చేపట్టాలి.
అధిక తేమలో పంటలు విత్తడం చేపట్టినట్లయితే మొలక కుళ్ళు వంటి తెగుళ్ళు ఆశించవచ్చును.
ప్రస్తుతం వేరుశనగ, పెసర, మినుము, ఆకు కూరలు వంటి పంటలు విత్తే రైతులు 2-3 రోజులు ఆగి ఆ తరువాత సరిపడు తేమలో విత్తుకోవాలి.
ప్రస్తుతం కూరగాయ పంటలలో ఆకు తినే పురుగులు ఆశించే అవకాశం వుంది. నివారణగా క్వినాల్ఫాస్ 2 మి.లీ. (లేక) క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ./లీ. నీటికి కలిపి పిచికారి చెయ్యాలి.
ఈదురు గాలులతో కూడిన అధిక వర్షపాతం వున్న ధృష్ట్యా రైతులు పక్వ దశకు వచ్చిన పండ్ల తోటలలో వెంటనే కోత చేపట్టవలెను.
అరటి రైతులు అధిక గాలుల నుంచి రక్షణ కోసం కర్రలను ఏర్పాటు చేసుకోవలెను.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు నిమ్మతోటల్లో గజ్జితెగులు ఆశించే అవకాశం ఉంది. నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ @ 30 గ్రాములు + స్ట్రెప్టోమైసిన్ @ 2 గ్రాములను 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
పశువులు, గొర్రెలు, మేకలు మొదలగు జీవాలను బయటకు వదలకుండా షెడ్ల లోపలే కట్టి ఉంచుకోవాలి.
అధిక వర్షాలకు పొలాలలో నిలిచిన నీటిని వీలయినంత త్వరగా వెలుపలకి పంపాలి. ఒకటి, రెండు రోజులు పురుగు / తెగుళ్ల మందులు పిచికారీ, ఎరువులు వేయడం వంటివి ఆపాలి”అని డా. జి. ఎల్. శివజ్యోతి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.