సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు
సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు
కొడవలూరు, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు పథకంలో లబ్ధిదారులందరూ భాగస్వాములై సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు.
మంగళవారం ఉదయం కొడవలూరులోని జగనన్న కాలనీలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు.
కాలనీ కి అవసరమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
లే అవుట్ లో మంజూరైన ప్రతి ఒక్క ఇంటి నిర్మాణ పనులు మొదలై బేస్మెంట్ స్థాయి దాటి పనులు చేపట్టాలన్నారు.
లబ్ధిదారులకు బిల్లును కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తోందన్నారు.
లబ్ధిదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అధికారులు ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం ఆయన నిర్మాణం పూర్తి చేసుకున్న ఇంటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి వేణుగోపాల్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.