చిరంజీవికి చంద్రబాబు ఫోన్…!
చిరంజీవికి చంద్రబాబు ఫోన్…!
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా..!!
హైదరాబాద్ (సదా మీకోసం) :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవికి సోమవారం ఫోన్ చేశారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువ సినీనటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నాయి.
గత శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తుండగా.. సాయిధరమ్ తేజ్ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
నగరంలోని తీగల వంతెన-ఐకియా రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.
మరోవైపు, సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన విషయం తెలిసి సినీ ప్రముఖులు ఆయన్ను పరామర్శించేందుకు ఆస్పత్రులకు వెళుతున్నారు.
తాజాగా, ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు.
రెండు మూడు రోజుల్లో సాయి ధరమ్ తేజ్ ఇంటికి తిరిగి వస్తాడని ఆకాంక్షించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్‌ను చూసేందుకు మోహన్ బాబుతోపాటు మంచు లక్ష్మి కూడా వెళ్లారు.
ఇది ఇలావుండగా, సాయిధరమ్ తేజ్‌కు చికిత్స చేస్తోన్న వీడియోలు బయటికి రావడం బాధాకరమని మరో యువనటుడు నిఖిల్ అన్నారు.
ఐసీయూలోకి కెమెరాలను ఎందుకు అనుమతించారు? అని ప్రశ్నించారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు నిఖిల్. కాగా, ఇటీవల సాయి ధరమ్ తేజ్ కు చికిత్స అందిస్తున్న వీడియోలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ చూడండి..
కళ్లు తెరవండి అంటూ వైద్యుడు సాయి తేజ్ చేతిపై తడుతున్న వీడియో ఇటీవల బయటకు వచ్చింది.
ఈ క్రమంలోనే నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నప్పుడైనా ఓ వ్యక్తి ప్రైవసీకి దయచేసి గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు.
కాగా, ఆదివారం సాయి ధరమ్ తేజ్ కు కాలర్ బోన్ శస్త్ర చికిత్స చేశారు అపోలో వైద్యులు. సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే.