అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యంతోనే భారీ నష్టం : ఒట్టూరు సంపత్ యాదవ్
అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యంతోనే భారీ నష్టం
తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్ యాదవ్
- ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
- సీఎం జగన్మోహన్ రెడ్డి గాలిలో షికార్లు చేయడం మాని నేలపైకి దిగొచ్చి బాధ్యతగా వ్యవహరించాలి
నెల్లూరు, నవంబర్ 23 (సదా మీకోసం) :
నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం, సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టీపట్టని వైఖరితో ఉన్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
వరద తాకిడికి ఊళ్లకు ఊళ్లు అతలాకుతలం అయిపోయాయని, నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ విధ్వంసం చోటుచేసుకుందన్నారు. సోమశిల జలాశయానికి వచ్చే నీటి నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, వరదలకు ముందే సోమశిల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుందని, రాయలసీమలో కురిసిన భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసినా ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించారు.
పెన్నానదితో పాటు ఉపనదులైన కుందూ, చెయ్యేరుల్లోనూ వరద పోటెత్తడం, డ్యాంలు తెగిపోవడంతో ఒక్క సారిగా ప్రవాహం సోమశిలపై పడింది ఈ ప్రవాహాలను అంచనావేయలేకపోయిన అధికారులు చివరి క్షణంలో ఒక్కసారిగా 5.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారన్నారు.
వీటికి అదనంగా బీరాపేరు, బొగ్గేరుల నుంచి వచ్చిన మరో రెండు లక్షల క్యూసెక్కుల నీళ్లు తోడయ్యాయని, ఇవన్నీ కలిసి 7.50 లక్షల క్యూసెక్కుల జలాలు ఒక్కసారిగా పెన్నాపరివాహక ప్రాంతాన్ని ముంచెత్తాయి 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని మాత్రమే తట్టుకోగలిగే పెన్నానది అదనంగా వచ్చిన ప్రవాహంతో కట్టలు తెంచుకుని ఊళ్లపై పడిందన్నారు.
ఇసుక మాఫియా విచ్చలవిడిగా పొర్లుకట్టలను ధ్వంసం చేయడం కూడా ప్రమాదం తీవ్రతను మరింత పెంచింది మినగల్లు నుంచి ముదివర్తిపాళెం వరకు ఇసుక మాఫియా ఆగడాలతో నీళ్లు ఊళ్లలోకి ప్రవేశించి భారీ నష్టం సంభవించిందని, వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇరిగేషన్ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించారన్నారు.
రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేయడంలోనూ విఫలమయ్యారని, జిల్లాలోని వాగులు, వంకల ప్రవాహాన్ని అంచనా వేయలేకపోవడం కూడా పూర్తిగా ఇరిగేషన్ అధికారుల తప్పిదమే ఇరిగేషన్ అధికారుల తాత్సారం కారణమన్నారు.