ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ..
పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ విద్య అమలు చేయాలన్న ఆయన.. స్కూళ్లలో 8వ తరగతి నుంచే కంప్యూటర్ విద్యను అందించాలన్నారు. అటు విద్యార్ధుల్లో ఇంగ్లీష్ పరిజ్ఞానంపై టోఫెల్ తరహ పరీక్షలను నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు.
ప్రతీ జిల్లాకు టీచర్ల కోసం ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, వర్చువల్ క్లాస్ రూమ్, ఇంగ్లీష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే హైస్కూల్స్‌లలో లైఫ్ స్కిల్స్, కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ఇక ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి ఐఐటీ, జేఈఈ లాంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలన్నారు. పోటీ పరీక్షలకు విద్యార్ధులు సన్నద్ధం అయ్యేలా బోధన ఉండాలని సూచించారు. కాగా, మధ్యాహ్న భోజనంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ తెలిపారు.
అటు స్కూళ్ల ప్రక్కనే అంగన్‌వాడీ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 35 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు లేవన్న ఆయన.. ప్రైమరీ స్కూళ్ల దగ్గర కేంద్రాలు ఉండేందుకు సరైన స్థలాలు ఉన్నాయా.? లేవా.? అనేది పరిశీలించి నివేదికను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు తెరిచేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.